ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:19 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

యూపీలో టగ్ ఆఫ్ వార్… కమలానికి డేంజర్ బెల్స్

లక్నో, అక్టోబరు 29,అర్జున్ సమాచారం:
ఉత్తరప్రదేశ్ శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీకి తిరుగులేని కంచుకోటలుగా భావించే పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ చొచ్చుకుపోయింది. మొత్తం 11 స్థానాలు 5 గ్రాడ్యుయేట్స్, 6 టీచర్స్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 5 స్థానాలను గెలుచుకోగా, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ 4 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క సీటు తేడాతో అధికార పార్టీ మెజార్టీని అడ్డుకోవడమే కాకుండా, విద్యావంతులు, ఉద్యోగుల వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఈ ఫలితాల ద్వారా ఎస్పీ స్పష్టమైన రాజకీయ సందేశాన్ని పంపింది.ఈ ఫలితాల్లో అత్యంత విస్మయకరమైన అంశం ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ నియోజకవర్గమైన వారణాసి ఉపాధ్యాయ స్థానాన్ని ఎస్పీ కైవసం చేసుకోవడం. కాషాయ పార్టీకి కంచుకోట లాంటి వారణాసిలో బీజేపీ అభ్యర్థిని మట్టికరిపిస్తూ ఎస్పీ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్ సాధించిన విజయం లక్నో నుంచి ఢిల్లీ దాకా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా మేధావులు, విద్యావంతులకు కేంద్రమైన అలహాబాద్-ఝాన్సీ గ్రాడ్యుయేట్స్ స్థానంతో పాటు ఆగ్రా డివిజన్లలో సైతం సమాజ్‌వాదీ పార్టీ విజయదుందుభి మోగించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇలాకా గోరఖ్‌పూర్, మీరట్ తదితర స్థానాల్లో బీజేపీ బయటపడినప్పటికీ.. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టభద్రుల స్థానాల్లో ఎస్పీ సాధించిన ఈ స్ట్రైక్ రేట్ కమలనాథులను ఆత్మరక్షణలోకి నెట్టింది.సాధారణంగా ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలంటే బీజేపీ, ఆరెస్సెస్ అనుబంధ సంఘాలకే మొదటి ప్రాధాన్యత ఉంటుందన్న సంప్రదాయానికి ఈ ఫలితాలు గండికొట్టాయి. నిరుద్యోగ సమస్య, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ డిమాండ్, కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సర్వీస్ క్రమబద్ధీకరణ వంటి క్షేత్రస్థాయి అంశాలను ఎస్పీ ఎన్నికల అస్త్రాలుగా మార్చుకోవడంలో పూర్తిస్థాయిలో సఫలీకృతమైంది. యువత, మధ్యతరగతి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని ఓట్ల రూపంలో మలచుకోవడంలో అఖిలేష్ యాదవ్ నెరిపిన సైలెంట్ ఆపరేషన్ తిరుగులేని ఫలితాన్ని ఇచ్చింది.కేవలం యాదవులు, మైనార్టీల ఓటు బ్యాంకు మాత్రమే కాకుండా.. విద్యావంతులు, పట్టభద్రులు, ఉపాధ్యాయ వర్గాల్లోనూ తమకు తిరుగులేని ఆమోదం లభిస్తోందని ఈ 4 ఎమ్మెల్సీ విజయాల ద్వారా ఎస్పీ నిరూపించుకుంది. రాబోయే ఎన్నికలకు ముందు విపక్ష శ్రేణుల్లో ఈ విజయం కొత్త ఊపును తీసుకురాగా, పట్టణ-విద్యావంతుల ఓటర్లను తిరిగి ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలు రచించాల్సిన అనివార్యతలోకి అధికార బీజేపీ వెళ్లిపోయింది